Thursday, March 26, 2009

నన్ను ప్రేమించవూ. . !

నువ్వు గుర్తుకొస్తావు నాకు,
మళ్లీ .. మళ్లీ... నిన్ను మర్చిపోవాలని
మరింతగా నేను పరితపిస్తున్నప్పుడు.

నా ఏకాంతాలన్నింటినీ ప్రేమగా
నీ మధురమైన
మాటల వాహినిలో కలుపుకొంటో ,
నా కనుపాపలపై వలపు కలలను
నీ నునులేత పెదవుల
మధుధారలతో చిత్ర రచన చేస్తో,

నిన్నటి కలవై,
కలలో మెరిసిన తారకవై,
కడలి అలవై,
అలసిన మదిలో వెలసిన చంద్రికవై,
వలపుపై,
నా మదిలొ వెన్నెల తలపువై,
నదివై,
సన్నిధివై,
వలపు పెన్నిదివై,
నాకు నెమ్మదివై,
నాకు
గుర్తుకొస్తావు నువ్వు.
నిన్ను మర్చిపోవాలని
మరింతగా నేను పరితపిస్తున్నప్పుడు

Saturday, October 4, 2008

నిన్న సాయంత్రం

నిన్న సాయంత్రం
ఎన్ని సార్లు నీకోసం ఎదురు చూశానో...
ప్రకృతి చిత్రాలన్నీ
నీలో దృశ్యత్వాన్ని పొందుతున్న
సమయాన,
నాహృదిలో నీ తలపులన్నీ
కొత్త ఊపిరులు పోసుకుంటున్న
సుషుప్త స్వాప్నికావస్తలో
నామనో ఫలకంపై వేవేల వర్ణాల్లో
రాగరంజితమై వెలసిన
నీ సుమనోహర సుకుమార గాత్రాన్ని
వర్ణించగల వర్ణాలేవి!?

Wednesday, March 19, 2008

నా మానవ సహొదరా!... నన్ను మన్నించు

నా మానవ సహొదరా!... నన్ను మన్నించు
అడగాలా? వద్దా? అని సందేహంగా
అడిగితే ఏమనుకుంటారోనని అనుమానంగా
అల్లంత దూరం నుంచే ..
ఆశగా వచ్చి, ఆత్మాభిమానాన్ని
నీ మాసిన చొక్కా వెనక
గుండెల్లో దాచేసుకొని..
కళ్ల నిండా దీనత్వం నింపుకొని
పస్తులతొ ఎండిన కడుపును
కనిపించనీయకుండా
నెమ్మదిగా నిస్సహాయతను గొంతులో నింపుకొని
ముక్కూ మోహం తెలియని నన్ను
నీ ఆత్మీయుడననుకొని,
ఆదుకుంటానని
నీకే వినిపించనంత నెమ్మదిగా
నిర్వేదంగా...
"ఓ పాత చొక్కా ఇస్తారా..!"
అన్న మాటల్లోని దైన్యం
మంచుకత్తిలా నా గుండెలను కోసింది.
కానీ!
నువ్వు ఆశించినట్లు
నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను
కాదు.కాదు.. ఇచ్చే మనసును కోల్పొయాను.

Thursday, August 23, 2007

నీకూ నాకూ...

నీకూ నాకూ...
ఈ కాసింత ఎడబాటుండాలి..!
అంతులేని విరహానికీ.!
అందమైన కలలకీ.!
చిన్ని చిన్ని కలతలతలకీ.!
వెచ్చని కన్నీళ్ళకీ.!
తీయని కోపాలకీ.!
ఇంకా...
తాపాలకీ..!
మనమధ్య ఈ కాసింత
ఎడబాటుండాలి

Sunday, March 4, 2007

కలలు + కల్పనలు = కాగితాలు
వేకువ జాముల్లో
నన్ను నేను మరిచినప్పుడు
గాఢ సుషుప్తిలో
అలసిన కనుపాపల కింద
కలలొచ్చి నన్ను కావలించుకుంటాయి

సుదూర సాగర సైకత తీరాలకు
వెన్నల కురిసే పచ్చిక బయళ్ళకు
పైరు పచ్చల పల్లె సీమలకు
పిల్లగాలుల మల్లె తోటలకు
సునాయాసంగా నను మోసుకెళతాయి