Saturday, October 4, 2008

నిన్న సాయంత్రం

నిన్న సాయంత్రం
ఎన్ని సార్లు నీకోసం ఎదురు చూశానో...
ప్రకృతి చిత్రాలన్నీ
నీలో దృశ్యత్వాన్ని పొందుతున్న
సమయాన,
నాహృదిలో నీ తలపులన్నీ
కొత్త ఊపిరులు పోసుకుంటున్న
సుషుప్త స్వాప్నికావస్తలో
నామనో ఫలకంపై వేవేల వర్ణాల్లో
రాగరంజితమై వెలసిన
నీ సుమనోహర సుకుమార గాత్రాన్ని
వర్ణించగల వర్ణాలేవి!?

Wednesday, March 19, 2008

నా మానవ సహొదరా!... నన్ను మన్నించు

నా మానవ సహొదరా!... నన్ను మన్నించు
అడగాలా? వద్దా? అని సందేహంగా
అడిగితే ఏమనుకుంటారోనని అనుమానంగా
అల్లంత దూరం నుంచే ..
ఆశగా వచ్చి, ఆత్మాభిమానాన్ని
నీ మాసిన చొక్కా వెనక
గుండెల్లో దాచేసుకొని..
కళ్ల నిండా దీనత్వం నింపుకొని
పస్తులతొ ఎండిన కడుపును
కనిపించనీయకుండా
నెమ్మదిగా నిస్సహాయతను గొంతులో నింపుకొని
ముక్కూ మోహం తెలియని నన్ను
నీ ఆత్మీయుడననుకొని,
ఆదుకుంటానని
నీకే వినిపించనంత నెమ్మదిగా
నిర్వేదంగా...
"ఓ పాత చొక్కా ఇస్తారా..!"
అన్న మాటల్లోని దైన్యం
మంచుకత్తిలా నా గుండెలను కోసింది.
కానీ!
నువ్వు ఆశించినట్లు
నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను
కాదు.కాదు.. ఇచ్చే మనసును కోల్పొయాను.